Allu Aravind:మా కుటుంబంలో ఎవరికీ అతను పీఆర్వో కాదు:అల్లు అరవింద్
Allu Aravind:తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి గోవాలో డిసెంబర్ 2న అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్‌లు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొంత మందికి సరైన సదుపాయాలని కల్పించడంలో నిర్వాహకుడు ఫెయిల్ అయ్యాడు.
దీంతో ఈ వేడుకలో తమని అవమానించారంటూ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు నిర్వాహకుడిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని, కన్నడ నటీనటులను అవమానించారని పేర్కొంటూ నెట్టింట పోస్ట్‌లు పెట్టారు. గోవాలో జరిగిన అవార్డుల కార్యక్రమం కోసం వచ్చిన వారికి ఎలాంటి అవమానం జరిగిందో తెలియజేస్తూ పలు వీడియోలని పోస్ట్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమను తప్పు పడుతూ కన్నడ పత్రికల్లో ప్రచురించిన పలు వార్తలు వైరల్ అయ్యాయి.
దీనిపై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్పందించారు. `అవార్డుల వేడుకలో ఇతర భాషల వారికి ఇబ్బందులు తలెత్తాయి. తెలుగు చిత్ర పరిశ్రను వాళ్లు తప్పుపడుతున్నారు. ఈ మేరకు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అవి చూసి నేను ఎంతో బాధపడ్డా. అది పూర్తిగా ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. ఒక వ్యక్తి చేసిన పనిని వేరే వాళ్లకు, ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. అతడు మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు. అది అతని పర్సనల్ ఫెయిల్యూర్`అన్నారు. తాజా వివాదంపై అవార్డులు నిర్వహించిన వ్యక్తి సంబంధిత నటీనటులకు క్షమాపణలు చెప్పారు.