Raghurama : ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలతో 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తారని నరసాపురం ఎంపీ, టీడీపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు ధీమా వ్యక్తం చేశారు. పోలింగకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడమే గెలుపునకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో వైసీపీ ఇక కనిపించదని పేర్కొన్నారు.
‘‘గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు 151. ఈ సంఖ్యలో ఎటువైపు ఉన్న ఒకటి పోతుందో తెలియదు. గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటుహక్కు వినియోగించుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచీ ప్రజలు ఓటేసేందుకు తరలి వచ్చారు. జన స్పందనతో పోలింగ్ రోజు మధ్యాహ్నానికే వైసీపీ నాయకులు తిరుగుముఖం పట్టారు’’ అని రఘురామకృష్ణ రాజు అన్నారు.