MLA Akhilapriya : విజయ డెయిరీ ఛైర్మన్ కు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వార్నింగ్
MLA Akhilapriya : అధికార టీడీపీకి చెందిన మాజీమంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి ఆమె నంద్యాల జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, కర్నూలు జిల్లా విజయ డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డితో గొడవకు దిగి ఫోన్ లో ఆయనను బెదిరించారు. అయితే, జగన్మోహన్ రెడ్డికి భూమా అఖిలప్రియ కోడలి వరుస అవుతారు. కర్నూలు జిల్లా విజయ డెయిరీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోలు పెట్టడం ఈ గొడవకు కారణం. ప్రభుత్వం మారిన తర్వాత కూడా అక్కడ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి ఫొటోలు లేకపోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు.
నంద్యాలలోని డెయిరీ కార్యాలయాన్ని భూమా అఖిలప్రియ సందర్శించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఎస్వీ జగన్ అక్కడ లేరు. దీంతో ఆమె ఆయన కుర్చీలో కూర్చొన్నారు. అక్కడి నుంచే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తరువాత కూడా వైఎస్ జగన్ ఫొటోలు అక్కడ కనిపించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించా చంద్రబాబు ఫొటోలు అక్కడ పెట్టారు.
తన కుర్చీలో అఖిలప్రియ కూర్చోవడం పట్ల ఎస్వీ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలా కూర్చొంటావని ప్రశ్నించారు. దీనితో ఆమె ఆగ్రహం పతాక స్థాయికి చేరింది. తనను ప్రశ్నించడానికి ఎలాంటి అధికారం లేదంటూ భూమా అఖిలప్రియ మండిపడ్డారు.