Pawan Kalyan : అన్ని సర్వేలు ఎన్డీయే కూటమిదే విజయం అంటున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతిలో మంగళవారం పవన్ కళ్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ గోవిందా.. గోవిందా.. అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. అన్ని సర్వేలు కూటమిదే విజయం అంటున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ పేదలకు సేవచేసే ఆరిణి శ్రీనివాసులును గెలిపించుకుందాం అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
తిరుపతిలో ఇల్లు కట్టుకోవాలంటే పది శాతం కమీషన్ ఇవ్వాలని అన్నారు. రేణిగుంట నుంచి అమరరాజా కంపెనీ, వోల్టాస్, రియల్ లైన్ కంపెనీలను తరిమేశారని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి రెండో మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు. తిరుమలను వైసీపీ ప్రభుత్వం రిసార్ట్ లా మార్చిందని పవన్ ఆరోపించారు. టీడీపీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై వెంకన్న స్వామి ఫొటో కాకుండా జగన్ ఫొటో వేస్తారా అని మండిపడ్డారు. టీటీడీ ఇంటి పట్టాలపై జగన్ ఫొటో ఎందుకు వేశారని ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామి కంటే జగన్ గొప్పవాడని వైసీపీ నేతలు భావిస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరుమల పవిత్రత కాపాడుతామన్నారు.