Hyderabad lab : తిరుమల లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదంతో తెరపైకి వచ్చిన కల్తీ నెయ్యి అంశం దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రసాదాలను పరీక్షించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హనుమకొండ భద్రకాళి ప్రసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం ఇప్పటికే హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ చర్లపల్లిలోని ల్యాబ్ కు పంపించారు. ఇక్కడ కొన్నేండ్లుగా మదర్ డెయిరీ నెయ్యి వాడుతున్నారు. నెలకు సుమారు 20 వేల నుంచి 25 వేల కిలోల నెయ్యిన వినియోగిస్తున్నారు. భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని నియమించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా నెయ్యి శాంపిల్స్ ను టెస్టులకు పంపించామని చెప్పారు. ఆలయంలో రోజు 3 వేల నుంచి 4 వేల లడ్డూలు తయారు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే వేములవాడ ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిని 20 రోజుల క్రితమే పరీక్షలకు పంపించారు.
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి చాలా రోజులుగా కరీంనగర్ డెయిరీ నెయ్యిని వాడుతుండగా, దేవాదాయ శాఖ ఆదేశాలతో వారం నుంచి విజయ డెయిరీ నెయ్యిని వినియోగిస్తున్నామని ఈవో విజయరామారావు తెలిపారు. హనుమకొండలోని భద్రకాళి టెంపుల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి, ప్రసాదాల నాణ్యతను పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు.