Sabarimala : శబరిమల భక్తులకు అలర్ట్.. అయ్యప్పస్వామి దర్శన సమయాల్లో మార్పులు

Sabarimala
Sabarimala : అయ్యప్పస్వామి భక్తులకు బిగ్ అలర్ట్. ఈ ఏడాది శబరిమల అయ్యప్నస్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంతి ప్రకటించారు. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనం వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ మార్పుల ద్వారా భక్తులకు 17 గంటల సుదీర్ఘ సమయం దర్శనానికి లభిస్తుందని అన్నారు.
ఈ సంవత్సరం అయ్యప్పస్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26 వరకు కొనసాగుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి (మకర విలక్కు) దర్శనమిస్తుంది. ఈసారి శబరిమలకు వచ్చే భక్తులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ ఉండదని తెలిపింది. ఆన్ లైన్ బుకింగ్స్ చేసుకున్న భక్తులకు 48 గంటల గ్రేస్ పీరియడ్ ను అందిస్తారు. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది.
మండలం మకర విళక్కు సీజన్ లో అయ్యప్పస్వామి దర్శనం కోసం భక్తులకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘ సమయం కల్పిస్తామని ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఆలయ అధికారులు, కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అయ్యప్ప స్వామి భక్తులకు మేలు చేకూరనుంది.