Bin Laden : అల్ ఖైదా ఉగ్రవాది, ఒసామా బిన్ లాడెన్ కు అత్యంత సన్నిహితుడు అమీన్ ఉల్ హక్ అరెస్టయ్యాడు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉగ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) ఆధ్వర్యంలో లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఆయనను అరెస్టు చేశాయి. ఈ సందర్భంగా సీటీడీ పంజాబ్ పోలీస్ అధికార ప్రతినిధి మాట్లాడారు. పంజాబ్ ప్రావిన్స్ లో ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ ద్వారా హక్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
అమిన్ ఉల్ హక్ 1996 నుంచి ఒసామా బిన్ లాడెన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారని, పంజాబ్ ప్రావిన్స్ అంతటా విధ్వంసకర చర్యలకు కుట్రలు చేశాడని చెప్పారు. ఉగ్రవాద నిరోధక విభాగం సామర్థ్యం, అంకితభావం, కృషి వల్లే హక్ ఆచూకీని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసిన సీటీడీ అధికారులు, విచారణ కోసం రహస్య ప్రాంతానికి తరలించారు. హక్ ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిందని, అతడి అరెస్టు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో గొప్ప విజయమని పేర్కొన్నారు.