Akshay Kumar-Tiger Shroff : గల్ఫ్ దేశాల్లో జై శ్రీరామ్, జై శ్రీకృష్ణా, జై నారాయణ్.. నినాదాలు హోరెత్తుతున్నాయి. ముస్లిం దేశాల్లో సైతం హిందూ ఆలయాలు నిర్మించబడి హైందవ సంస్కృతి విశ్వవ్యాప్తమవుతోంది. యూరప్, అమెరికాల్లోనే కాదు ముస్లిం దేశాల్లోనూ హిందు ఆలయాలను నిర్మించడం గొప్ప విశేషమని చెప్పవచ్చు. అబుదాబిలో BAPS(బోచ సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్) మందిర్ ను BAPS సొసైటీ నిర్మించింది. ఇది శ్రీకృష్ణుడి అవతారమైన స్వామి నారాయణుడిని పూజించే హిందూ శాఖ.
ఈ ఆలయాన్ని రెండు దేశాల సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించారు. పింక్ రాజస్థానీ ఇసుకరాయి, తెలుపు ఇటాలియన్ పాలరాయితో నిర్మించారు. వేదాల సారాంశాన్ని బట్టి ఈ ఆలయాన్ని డిజైన్ చేశారు. అలాగే ఆలయంలోని ఏడు గోపురాలు ఎమిరేట్ ను సూచిస్తాయి. ఇందులోని ప్రతి శిఖరం రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాసాల కథలను వర్ణిస్తుంది. BAPS ఆలయం గల్ఫ్ ప్రాంతంలోనే అతిపెద్దది. ఈ ఆలయాన్ని రూ.700 కోట్లతో నిర్మించారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ విరాళంగా ఇచ్చిన 13 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి ఇనుము, ఉక్కు వాడకపోవడం దీని ప్రత్యేకత.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గొప్ప భక్తుడు అని మనకు తెలిసిందే. ఫిబ్రవరిలో BAPS ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించినప్పుడు అక్షయ్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ విశేషాలను అక్షయ్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు కూడా. ‘‘అబుదాబిలోని BAPS ఆలయ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఇది గొప్ప చారిత్రక ఘట్టం’’ అని పోస్ట్ చేశారు.
తాజాగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ కొత్త సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’ రిలీజ్ సందర్భంగా BAPS ఆలయాన్ని సందర్శించారు. తమ సినిమా విజయానికి ఆశీస్సులు కోరుతూ సంప్రదాయ వస్త్రధారణలో ఇద్దరు స్వామివారిని దర్శించుకున్నారు. గుడి పడ్వా, నవరాత్రి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అక్షయ్ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘‘అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ను సందర్శించే అవకావం లభించింది. ఇది పూర్తిగా దైవిక అనుభవం. ఔర్ హాన్, నవరాత్రి, గుడి పడ్వా, ఉగాది శుభాకాంక్షలు.. ప్రజలందరికీ శుభం జరగాలని ఆ దేవున్ని కోరుతున్నా..’’ అని పేర్కొన్నారు. కాగా, ‘బడే మియాన్ చోటే మియాన్’ మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలోకి రాబోతోంది.