Airplane Floating In Sea : విమాన ప్రయాణమంటేనే ఒక్కోసారి భయపడుతుంటాం.. ఎందుకంటే ఒక్కోసారి అవి కూలిపోతే జరిగే ప్రాణనష్టం మాములుగా ఉండదు. అయినా ప్రయాణించక తప్పదు. అయితే అన్ని సందర్భాల్లో ఇలా జరగదు. ఎన్నో ఏండ్ల పాటు సురక్షిత ప్రయాణం చేసిన విమానాలు ఎన్నో ఉన్నాయి. భయమని చెప్పి ప్రయాణాలు మాత్రం ఆపుకోలేం కదా..
అయితే తాజాగా అమెరికా కు చెందిన నిఘా విమానం ఒకటి రన్ వే పై నుంచి సముద్రంలోకి దూసుకెళ్లింది. హవాయిలో ఈ ఘటన జరిగింది. అమెరికా నౌకదళానికి చెందినది ఈ విమానం. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హవాయిలోని మెరైన్ కోర్ బేస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని ఈ కోర్ ప్రతినిధి ఓర్లాండ్ ప్రెజ్ ప్రకటించారు. వెంటనే అక్కడి కోస్ట్ గార్డ్ సిబ్బంది స్పందించడంతో, విమానంలో సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తున్నది.
ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విజిబిలిటీ తక్కువ ఉన్నట్లు తెలుస్తున్నది అమెరికా నౌకదళానికి చెందిన పీ 8 ఏ పొసాడెన్ విమానం కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇక్కడ శత్రువుల సబ్ మెరైన్లను గుర్తించి , దాడి చేస్తుంది. ఇంటలిజెన్స్ సమాచారం కూడా అందిస్తుంది. ఇక టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను కూడా తీసుకెళ్తుంది. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయనేది మాత్రం కోర్ ప్రతినిధి వెల్లడించలేదు. ఇలాంటి విమానం భారత్ వద్ద కూడా ఉంది. దీంతో పాటు ఆస్ర్టేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ , నార్వే సైన్యాలు కూడా వాడుతున్నాయి. 2009లోనూ హడ్సన్ నది వద్ద ఇలాంటి ఘటన జరిగింది. అయితే పైలెట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక తాజాగా జరిగిన ప్రమాద సమయంలో సముద్రంలో బోటింగ్ చేస్తున్నవారు ఒక్కసారిగా విమానం నీటిపై తేలియాడడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ అవుతున్నది.