Air India : ప్రీమియం ఎకానమీ సీట్లు అమర్చిన నారోబాడీ విమానమైన ఎ-320 నియో, ఎయిరిండియాకు చేరింది. ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, అదనపు లెగ్ రూం ఉండే 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ తరగతి సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్ కు భిన్నంగా, సరికొత్త లివరీతో ఈ విమానాన్ని తీర్చిదిద్దారు. ఫ్రాన్స్ లోని ఎయిర్ బస్ తయారీ ప్లాంటు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ విమానం ఆదివారమే చేరింది.
ప్రభుత్వ ఆధీనంలోని ఎయిరిండియా, టాటా గ్రూప్ ఆధీనంలోకి వచ్చాక, విమానాల ఆధునికీకరణ ప్రారంభమైంది. ఇప్పటికే ఉన్న విమానాల్లో సీట్లు సహా, ఇతర సదుపాయాలను మెరుగుపరుస్తామని, సరికొత్త విమానాలను సమకూర్చుకుంటున్నామని సంస్థ గతంలోనే ప్రకటించిన సంగతి విదితమే. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చేలా, ఇప్పుడు నారోబాడీలోనూ 3 తరగతుల సీట్లను అమర్చారు. దేశీయ మార్గాల్లో ఈ విమానాన్ని వచ్చే నెల నుంచి నడపనున్నారు. ఇప్పటికే ఎయిర్ బస్ 320 నియో విమానాలు 3 ఎయిరిండియా దగ్గర ఉన్నా, అవన్నీ పాత డిజైన్ ప్రకారం రూపొందించినవే.