Bhatti Vikramarka : బడ్జెట్ లో వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యమిచ్చి, అధికంగా రూ.72,659 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు (గురువారం) తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది రైతుల తలరాతలు మార్చే చరిత్రాత్మక నిర్ణయమన్నారు. దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది మైలురాయి అని పేర్కొన్నారు.
రైతు భరోసా సహా ఇచ్చిన హామీలన్నీ అమలుచేసి తీరుతామన్నారు. బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదు. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని, అసమానతలు లేని సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ ఏడాదిలోనే రైతు కూలీలకు రూ.12 వేలు అందించే బృహత్తర కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. పీఎం ఫసల్ బీమా యోజనలో చేరాలని నిర్ణయించామని, రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.
వరి రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం. ఆయిల్ పామ్ రైతులకు అవసరమైన సాయం అందిస్తామన్నారు. 2024-25 సంవత్సరానికి రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో ఆ పంట సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 77,857 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరగ్గా.. 23,131 ఎకరాలకు అనుమతులిచ్చామని భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.