Ex Speaker Pocharam : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. పోచారం సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న సమయంలో ఆయన నివాసం వద్ద ఆందోళనకు దిగారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు పోచారం ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాల్క సుమన్, టీఆర్ఎస్ యూవీ నేత గెల్లు శ్రీనివాస్ తదితరులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టుకు తరలిస్తున్న క్రమంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
మరోవైపు ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. సీఎం ఉన్నప్పుడే పోచారం ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు చొచ్చుకురావడం కలకలం రేపింది. బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తుంటే అక్కడున్న పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్, సీఎం ముఖ్య భద్రతాధికారి గుమ్మి చక్కవర్తి అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీడియోలను పరిశీలించి ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.