Gudivada Amarnath : ఏపీ ఎన్నికల ఫలితాలతో పెను మార్పులు సంభవించబోతున్నాయి. మూడు రాజధానులంటూ నానా యాగి చేసిన వైసీపీకి ఎన్నికల ఫలితాలు కనువిప్పు కలిగించాయి. వైసీపీ దారుణ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి మూడు రాజధానుల నిర్ణయం. ఇదే వైసీపీ పెద్ద వైఫల్యంగా ప్రజలు భావించారు. అందుకే 151 సీట్లున్న వైసీపీని 11 సీట్లకు దించారు. వైసీపీ హయాంలో వివాదస్పదమైన మూడు రాజధానుల నిర్ణయంపై ఆ పార్టీ స్వరం మార్చుకున్నట్లు కనపడుతోంది. దీనిపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా మారాయి.
తాజా ఎన్నికల్లో అమరావతితో పాటు విశాఖ సహా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ పార్టీని తిరస్కరించారు. మూడు జిల్లాల్లోనూ వైసీపీకి కేవలం రెండంటే రెండు సీట్లు కట్టబెట్టారు. అమరావతిలోనూ ఆ పార్టీ అడ్రస్స్ గల్లంతైంది. దీంతో రెండు ప్రాంతాల ప్రజలు వైసీపీని ఘోరంగా తిరస్కరించినట్లు స్పష్టం అవుతోంది. అమర్నాథ్ మాట్లాడుతూ..రాజధానిపై తాజాగా వచ్చిన ఫలితాలు రెఫరెండమేనని అంగీకరించడం గమనార్హం. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా ప్రజలు తిరస్కరించడంపై అధ్యయనం చేయాల్సిన అవసరముందని చెప్పుకొచ్చారు.
తాము తెచ్చిన సంస్కరణల కారణంగా పార్టీ కేడర్ కు గౌరవం దక్కలేదని, నాయకత్వానికి కేడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రభుత్వం-పార్టీ మధ్య దూరం పెరిగిందని ఒప్పుకున్నారు. సుపరిపాలన అందించినా ఎందుకు గెలవలేకపోయామో చర్చించుకుంటామన్నారు. వైజాగ్ లో తాము నిర్మించిన వ్యూ పాయింట్ తీసేయాలి అనుకుంటే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని దాన్ని కూడా తీసేయాలని చెప్పారు. పేదల పక్షం ఉండాలనే తమ అధినాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని అమర్నాథ్ పేర్కొన్నారు.