Afghanistan Vs New Zealand : న్యూజిలాండ్ పై టీ 20 వరల్డ్ కప్ లో అఫ్గానిస్తాన్ గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ టీం ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం దంచి కొట్టారు. గుర్జాబ్ 56 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. అయిదు సిక్సులు, అయిదు ఫోర్లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం మూడు ఫోర్లు, రెండు సిక్సులతో 44పరుగులు చేశాడు.
దీంతో 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్స్ రాణించకపోవడంతో 158/6 ఇన్సింగ్స్ ముగించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, మ్యాథ్ హెన్రీ రెండేసి వికెట్లు తీయగా.. లూకీ ఫెర్గూసన్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 159 పరుగుల ఛేదనతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయి చెత్త ఓటమిని మూట గట్టుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే రెండెంకెల స్కోరు చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిట్ డిజిట్ కే పరిమితమై దారుణంగా విఫలమయ్యారు. దీంతో న్యూజిలాండ్ దారుణ ఓటమి మూటగట్టుకుంది.
అఫ్గానిస్తాన్ బౌలర్లలో ఫజుల్ ఫారూఖీ మరో సారి 4 వికెట్లు తీయగా.. కెప్టెన్ రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు, మహమ్మద్ నబీ రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ను 15 ఓవర్లలోనే ఆలౌట్ చేశారు. అంతర్జాతీయ టీ 20ల్లో అఫ్గానిస్తాన్ కు ఇదే భారీ విజయం. పెద్ద జట్లపై గెలిచే సత్తా ఉందని అఫ్గాన్ మరోసారి నిరూపించింది.
ఈ విజయం కోసం మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్నామని అఫ్గాన్ ఓపెనర్ గుర్జాబ్ అన్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా గుర్బాజ్ ఎంపికయ్యాడు. ఒకే టీ 20 లో ఇప్పటి వరకు ఇద్దరు నాలుగు వికెట్లు తీసిన సందర్భాల్లో ఇది కేవలం మూడోది మాత్రమే.. అంతకు ముందు పాకిస్థాన్ బౌలర్లు షాహిద్ ఆఫ్రిది, ఉమర్ గుల్, రషీద్ ఖాన్, ముజీబ్, ప్రస్తుతం ఈ మ్యాచ్ లో ఫరూఖీ, రషీద్ ఈ ఘనత అందుకున్న వారిలో ఉన్నారు.