JAISW News Telugu

BJP Leaders : అర్ధరాత్రి దాక అగ్రనేతల ‘సర్దుబాటు’ చర్చ..

Political Leaders

BJP Leaders

BJP Leaders : ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ స్పీడ్ పెంచారు. తమ కూటమిలోకి బీజేపీని కలుపుకునే ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. గురువారం రాత్రి చంద్రబాబు, పవన్ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు.

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కు పైగా సీట్లను సాధించాలన్న టార్గెట్ తో  పీఎం మోదీ తన పాత మిత్రులను అందరినీ ఎన్డీఏ దరికి చేర్చుతున్నారు. దీనిలో భాగంగా టీడీపీని కూడా తిరిగి ఎన్డీఏలో చేర్చుకునే అంశంపై కసరత్తు వేగవంతమైంది. ఇందులో భాగంగానే చంద్రబాబు, పవన్ ఢిల్లీ యాత్రకు వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో రాత్రి 10.30 నుంచి 12.10గంటల దాక వీరి చర్చలు సాగాయి.

కాగా, రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ సీట్లలో మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్ సభ, 24 అసెంబ్లీ సీట్లను టీడీపీ కేటాయిస్తోంది. ఇప్పటికే తొలి జాబితా ప్రకటన కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరిగింది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకుమించి ఇస్తే కూటమికి నష్టం వాటిల్లే ప్రమాదముందని టీడీపీ నాయకులు చెప్తున్నారు.

ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం మరో సారి సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖరారైనట్టే. దీంతో  సీట్ల సర్దుబాటు పూర్తయితే అభ్యర్థుల ప్రకటనే తరువాయి. అయితే చర్చల అనంతరం సీట్ల సంఖ్యలో కొంత అటు ఇటు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో మూడు పార్టీల కూటమే జగన్ ను ఢీకొట్టబోవడం ఖాయం.

Exit mobile version