KTR petitions : నాగార్జున, కేటీఆర్ పిటిషన్లపై విచారణ వాయిదా
KTR petitions : మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హీరో నాగార్జున వేర్వేరుగా వేసిన పరువు నష్టం దావా పిటిషన్లపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కొండా సురేఖ తరపున న్యాయవాది గురుమిత్ సింగ్ హాజరయ్యారు. రెండు పిటిషన్లపై విచారణను న్యాయస్థానం నవంబరు 13కు వాయిదా వేసింది.
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు (బుధవారం) నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. గత విచారణలో కేటీఆర్, దాసోజ్ శ్రవణ్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన కోర్టు, ఈ రోజు మిగిలిన ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ స్టేట్ మెంట్ ను రికార్డు చేయవలసి ఉంది. కాగా, తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు హీరో అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్ పై మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్ మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేయవలసి ఉంది.