Adivi Sesh:బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోగా అవతరించాడు అడివి శేష్. కెరీర్ ఆరంభం ఒక డెబ్యూ హీరో చిత్రంలో సహాయక పాత్రలో నటించిన శేష్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన విధానం, అతడి ప్రతిభ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. ముఖ్యంగా అతడు నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగాను గొప్ప పనితనం ఉన్నవాడిగా మెప్పిస్తున్నాడు. తన దర్శకులతో కలిసి హిట్లు సూపర్ హిట్లు ఎలా కొట్టాలో తెలిసిన మేధావిగా అడివి శేష్ ఐక్యూ లెవల్ గురించి ఎంత పొగిడినా తక్కువే. నేడు ఆయన పుట్టిన రోజు.
సినీపరిశ్రమలో నటవారసులు సైతం చతికిలబడుతుంటే శేష్ కెరీర్ గ్రాఫ్ మాత్రం అమాంతం స్కైని టచ్ చేసింది. ఇక శేష్ నటించిన క్షణం- గూఢచారి- మేజర్ ఏ రేంజు హిట్లో తెలిసిందే. ఇందులో స్పై యాక్షన్ కంటెంట్ తో రూపొందించిన గూఢచారి చాలా ప్రత్యేకమైన సినిమా. దీనిలో వరుసగా సినిమాలు తెరకెక్కనున్నాయని శేష్ ఇంతకుముందే ప్రకటించారు. ప్రస్తుతం శేష్ ఇతర చిత్రాలతో బిజీగా ఉంటూనే గూఢచారి విశ్వంపై దృష్టి సారించానని తెలిపాడు.
ప్రస్తుతం గూఢచారి 2 (జీ2) పని జరుగుతోంది. తదుపరి ఇదే ఫ్రాంఛైజీలో గూఢచారి 3 (జీ 3), గూఢచారి 4 (జీ 4) చిత్రాలు కూడా ఉంటాయని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. గూఢచారి విశ్వంలో సినిమాలను ఆపే ప్రసక్తే లేదని తెలిపాడు. అలాగే గూఢచారి చిత్రాలను తెలుగులో తెరకెక్కించి హిందీలోకి అనువదిస్తామని కూడా శేష్ వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో అడివి శేష్ తన తదుపరి చిత్రం శేష్ ఎక్స్ శ్రుతి గురించి ప్రస్థావించారు.
శ్రుతిహాసన్ లాంటి సీనియర్ కథానాయికను ఎంపిక చేయడానికి కారణమేమిటి? అని ప్రశ్నిస్తే.. ఈ సినిమాలో శ్రుతి పాత్ర నటనకు ఆస్కారం ఉన్నది. తను మాత్రమే ఆ పాత్రకు సరిపోతుందని భావించి ఎంపిక చేసుకున్నాం. ఎవరో ఒక కొత్త నాయికను ఇలాంటి పాత్ర కోసం ఎంపిక చేయలేమని శేష్ వివరణ ఇచ్చారు. శ్రుతి లాంటి సీనియర్ కథానాయిక తమ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని కూడా అన్నారు.