Adilabad SP : రైతులపై పోలీసులు లాఠీచార్జ్ జరపలేదు ఆదిలాబాద్ ఎస్పీ

Adilabad SP
Adilabad SP : రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం ఖండించారు. పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులను అడ్డుకొని చెదరగొట్టారన్నది అవాస్తవమని అన్నారు. రైతుల బాగు కోసం ఎటువంటి అపాయం జరగకుండా, వారి క్షేమం కోసం సదుద్దేశంతో రైతులందరినీ క్రమబద్దీకరణతో వరుస క్రమంలో ఏర్పాటు చేయడం కోసం పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తుంటారని గ్రహించాలని తెలిపారు.
పోలీసుల సహకారంతో ప్రశాంతంగా రైతులు వరుస క్రమంలో విత్తనాలను తీసుకొని తిరిగి వెళ్తున్నారని ఎస్పీ చెప్పారు. ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్ లో ఏర్పడలేదని, రైతుల తోపులాట అనేది ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఆందోళనకర అవాస్తవమైన వార్తలను ప్రచారం చేయవద్దని సూచించారు. అవాస్తవమైన వార్తలను స్క్రోలింగ్ చేసిన, ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ గౌస్ హెచ్చరించారు.