Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వొద్దని అధికార పార్టీ కంకణం కట్టుకున్నట్టు కనపడుతోంది. దీనికి ప్రభుత్వం చేస్తున్న చర్యలే నిదర్శనంగా కనపడుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీలోకి దిగుతారని గతేడాది నుంచే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అధికార పార్టీ కొన్నాళ్ల క్రితమే పెద్ద పన్నాగానికి తెరతీసింది. ఇక్కడ తమకు అనుకూలమైన అధికారులను ఎన్నికల విధుల్లో నియమించుకునేందుకు పావులు కదిపింది.
పిఠాపురం నియోజకవర్గానికి ఆర్వో, ఈఆర్వోల నియామకం విషయంలో పెద్ద ఎత్తుగడే వేసింది. ఈఆర్వోగా కుడా వైస్ చైర్మన్ కె.సుబ్బారావును, ఆర్వోగా సంయుక్త కలెక్టర్ ను నియమించాలని కలెక్టరేట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. అన్ని నియోజకవర్గాలకూ ఈఆర్వోగా పనిచేసిన అధికారే రిటర్నింగ్ అధికారిగా ఉండగా, ఇక్కడ మాత్రం ఈఆర్వో, రిటర్నింగ్ అధికారులను వేర్వేరుగా నియమించారు.
ఐఏఎస్ ల బదిలీల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం ఐటీడీఏ పీవో, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ గా పనిచేసిన సీవీ ప్రవీణ్ ఆదిత్యను కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ గా నియమించారు. దీంతో ఆయన పిఠాపురం ఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.
పవన్ కల్యాణ్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసిన ఓడిస్తానని సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యే ప్రకటించడం, ఎన్నికల అధికారుల నియామకంలో నిబంధనలు ఉల్లంఘించడం చూస్తుంటే..పిఠాపురంపై అధికార పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి సారించిందనడానికి నిదర్శనంగా కనపడుతోంది.