Murali Mohan Comments : తెలుగు సినీ చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత హీరోలుగా అంతటి పేరు తెచ్చుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నిలిచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాగే ఈ ముగ్గురు హీరోలు కూడా అన్ని జోనర్లలో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఎన్నో విజయాలను అందించారు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఈ ముగ్గురు మల్టీస్టారర్ చిత్రాలు చేసి తమ మధ్య స్నేహబంధం ఎలాంటిదో రుజువు చేశారు. వారి మధ్య స్ఫూరిదాయకమైన పోటీయే తప్ప, వ్యక్తిగత పోటీ.. ద్వేషాలు కనిపించేవి కావు. ఇక హీరో కృష్ణ.. స్వతహాగా ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఒక దశలో ఎన్టీఆర్ కు ధీటుగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నాడు.
కృష్ణ.. శోభన్ బాబుల మధ్య వ్యత్యాసమిదే..
హీరో కృష్ణ మాస్, సాంఘిక చిత్రాలతో తెలుగు ఇండస్ర్టీలో దూసుకుపోయారు. నట భూషణ్ శోభన్ బాబు అటు కుటుంబ కథా చిత్రాలు, ఇటు మాస్ సినిమాలతో అలరించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణకు మురళీ మోహన్ క్లాస్ మేట్. ముందు నుంచి వీళ్లదిద్దరి మధ్య మంచి స్నేహసంబంధాలు ఉండేవి. ఇక శోభన్ బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారిలో మురళీమోహన్ ఒకరు. అలా వీళ్లిద్దరిని అతి దగ్గరి నుంచి చూసిన మురళీమోహన్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ లో హీరో కృష్ణ నిర్మాతల పాలిట దేవుడని పేర్కొన్నారు. తన సినిమాలతో నిర్మాత నష్టపోతే కృష్ణ పిలిచి మరీ మరో సినిమా చేసేవారని, ఆ సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా తీసుకోకపోయేవాడని పేర్కొన్నారు. ఒక వేళ నిర్మాత దగ్గర డబ్బు లేకపోయినా తానే స్వయంగా సర్దుబాబు చేయడం లేదా ఫైనాన్షియర్లతో మాట్లాడి ఆ డబ్బుకి హీరో కృష్ణ హామీ ఇచ్చేవాడని మురళీ మోహన్ పేర్కొన్నారు. సినిమా హిట్టయితే లాభాలు కూడా నిర్మాతకే ఇచ్చేవారని, అందులో కేవలం తన రెమ్యునరేషన్ మాత్రమే తీసుకునేవారన్నారు. కొన్ని సందర్భాల్లో సినిమా హిట్టయ్యాక డబ్బులు తీసుకున్నాడని, ప్లాఫ్ అయితే డబ్బులు కూడా అడగకపోయేదన్నారు. అలా ఎంతో మంది నిర్మాతలకు హీరో కృష్ణ దేవుడిలా ఆదుకున్నాడన్నారు.
శోభన్ బాబు స్ట్రిక్ట్..
ఇక హీరో శోభన్ బాబు రెమ్యూనరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు మురళీమోహన్. ఒప్పుకున్న సినిమాకు అడ్వాన్స్ ఇస్తేనే శోభన్ బాబు షూటింగ్ కి వచ్చేవారట. శోభన్ బాబు ఫైనాన్షియల్ గా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉండేవారట. శోభన్ బాబు తన డబ్బుని భూములపై పెట్టుబడి పెట్టేవారని అందరికీ తెలిసిందే. భూముల కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ సమయానికి డబ్బులు చెల్లించాల్సి వచ్చేదని, అందుకే రెమ్యూనరేషన్ విషయంలో స్ట్రిక్ట్ గ ఉండేవారట. తాను చెల్లించాల్సిన డబ్బులు, భూముల వివరాలు ఓ పుస్తకంలో రాసిపెట్టుకునేవారట. ఆ పుస్తకం ఎప్పుడూ తన వెంటే ఉండేదని, షూటింగ్ లొకేషన్ కి కూడా వెంట తెచ్చుకునేవారట. తాను చెల్లించాల్సిన డబ్బులను సమయానికి ఇవ్వకపోతే మిగతా వారు ఇబ్బందులు పడతారని అందుకే రెమ్యూనరేషన్ విషయంలో మరో అవకాశం ఇవ్వకపోయేవారని చెప్పుకొచ్చారు మురళీ మోహన్.