ASER Survey : సోషల్ మీడియాలో యాక్టివ్.. చదువుల్లో సైలంట్ మోడ్..ఇదే నేటి పిల్లల తీరు..
ASER Survey : నేటి పిల్లలు సెల్ ఫోన్ కు ఎలా అడిక్ట్ అయ్యారో మనకు తెలిసిందే. అప్పుడే పుట్టిన చిన్నారిని నుంచి కాలేజీకి వెళ్లే యువత వరకు యూట్యూబ్, షార్ట్స్ అంటూ అందులోనే లీనమైపోతున్నారు. సోషల్ మీడియాలోనే సమస్తం ఉందంటూ బయటి సామాజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇక పాఠశాల విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. టెన్త్ చదివే విద్యార్థి సైతం చిన్న చిన్న లెక్కలు చేయడానికి సెల్ ఫోన్ లోని క్యాలెక్యులెటర్ ఓపెన్ చేస్తున్నారు. చిన్న చిన్న ఇంగ్లిష్, తెలుగు వ్యాఖ్యలు చదవడం రావడం లేదు. ఇది ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు, కార్పొరేట్ చదువుల పరిస్థితి ఇలానే ఉంది.
తాజాగా అసర్( వార్షిక స్థాయి విద్యా నివేదిక)-2023 సర్వే విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు దారుణంగా పడిపోతున్నాయని తేల్చింది. ఈ సర్వేను దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 గ్రామీణ జిల్లాల్లో నిర్వహించారు. మొత్తం 1664 గ్రామాల్లోని 34,745 మంది విద్యార్థులను ప్రశ్నించి ఈ నివేదికను తయారు చేశారు.
కాగా, రాష్ట్రంలో 17-18 ఏళ్ల వయస్సు ఉన్న గ్రామీణ ప్రాంత యువతలో 40.10శాతం మంది చదువు మానేస్తున్నారు. అంటే ఇంటర్ తర్వాత వారు డిగ్రీ, ఇతర ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. 14-16 వయసు వారు సైతం 2వ తరగతి పాఠం తప్పులు లేకుండా చదవలేని పరిస్థితి ఉంది. అంతేగాక సగానికిపైగా విద్యార్థులు 3 అంకెల భాగహార లెక్కలు చేయలేయపోతున్నారు. 57.3 శాతం మంది ఇంగ్లిష్ చదవగలిగినప్పటికీ వారిలో మూడో వంతు స్టూడెంట్స్ మాత్రమే వాటి అర్థాలు చెప్పగలుగుతున్నారు.
ఇక ఈ విద్యార్థులను భవిష్యత్ లో ఏం కావాలని కోరుకుంటున్నారని అడగ్గా.. అత్యధికంగా 9.8 శాతం మంది అబ్బాయిలు పోలీస్, 25 శాతం మంది అమ్మాయిలు నర్స్ అవుతామని చెప్పారు. మరింత ఆసక్తి కలిగించే అంశం ఏంటంటే.. దాదాపు 75 శాతం మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. 91.40 శాతం మంది ఏదో ఒక సామాజిక మాధ్యమాన్ని వాడుతున్నారు. ఇలా మరెన్నో విషయాలను ఆ సర్వే చెప్పుకొచ్చింది.
దేశంలోని ఎక్కువ శాతం మంది పిల్లలు ఇలా సెల్ ఫోన్ మోజులో పడి చదువులపై దృష్టి సారించకపోవడంపై మేధావులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పిల్లలను బట్టి విధానంలో పరీక్షలకు సిద్ధం చేయడంపై కూడా వారు మండిపడుతున్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేలా చేసి.. టెక్నాలజీని ఎంత వాడుకోవాలే అంతే వాడుకునేలా విద్యార్థుల పేరెంట్స్, టీచర్లు కృషి చేయాలని వారు కోరుతున్నారు.