JAISW News Telugu

Revanth Sarkar : బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్.. రేవంత్ సర్కారు రెడీ?

Revanth Sarkar

Revanth Sarkar

Revanth Sarkar : అధికారం మారినా అధికారుల తీరు మారడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇంకా బీఆర్ఎస్ నేతలకు కీలక సమాచారం జారవేస్తున్నారు. దీంతో కీ వారి చేతుల్లోకే వెళ్తోంది. ఇలా చేయడంతో ప్రభుత్వంపై మచ్చ పడుతోంది. దీనికి పలువురు అధికారులు బీఆర్ఎస్ నేతలకు కొమ్ము కాస్తున్నారని సమాచారం. దీంతోనే బీఆర్ఎస్ కనుసన్నల్లో అధికార యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమైన శాఖల నిర్వహణలో లోపాలు ఉంటే వాటిని సరిచేయాల్సిన అధికారులే వాటి గురించి ప్రతిపక్షానికి లీకులు ఇస్తున్నారు. దీంతో వారు దీన్ని పెద్దదిగా చేసి మార్కులు కొట్టేయాలని పథకం పన్నుతున్నారు. దీని వల్ల రేవంత్ రెడ్డి సర్కారుకు లేని తలనొప్పులు వస్తున్నాయి. సాగునీరు, తాగునీరు, విద్యుత్ తదితర రంగాలకు చెందిన కీలక సమాచారం బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారని ఆధారాలు లభిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల తరువాత కోవర్టులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమవుతోంది. ఇలా ప్రభుత్వ సమాచారం ఇతరులకు చేరవేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారెవరో గుర్తించి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొన్ని కీలక శక్తులు పనిచేస్తున్నట్లు సమాచారం.

గతంలో బీఆర్ఎస్ హయాంలో ఆర్థికంగా, ఉద్యోగపరంగా ప్రయోజనం పొందిన ఆఫీసర్లు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ లీడర్లతో టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సమాచారాన్ని గోప్యంగా వారికి చేరవేస్తూ వారిని ఇరుకున పెట్టాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి ఓయూ సంఘటనే ప్రధాన సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ అధికారి ఒత్తిడి మేరకు ఓయూలో హాస్టల్స్ మూసివేస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేయడం సంచలనంగా మారింది.

ఇలా అధికారులు ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి సర్కారుకే చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరందరిపై లోక్ సభ ఎన్నికల తరువాత చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. సర్కారును ఇరుకున పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Exit mobile version