Dilsukhnagar : దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
Dilsukhnagar : దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) మృతి చెందాడు. చర్లపల్లి జైలులో జీవిత ఖైదీగా ఉండగా అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు దాడుల్లో మక్బూల్ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో మక్బూల్ కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 6 నెలల క్రితం మక్బూల్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకు వచ్చారు.
హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ డిపో ఎదురుగా 2013 ఫిబ్రవరి 21న బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు చోట్ల మూడు పేలుళ్లు సంభవించాయి. సైకిల్ మీద అమర్చిన బాంబులను కోణార్క్ థియేటర్, వెంకటాద్రి థియేటర్ మధ్యలో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మరణించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో భయాందోళనకు గురిచేసింది.