Bapatla : బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. సైన్స్ ల్యాబ్ లో అనుకోకుండా ప్రమాదకర వాయువులు విడుదలయ్యాయి. విద్యాలయం ల్యాబ్ లో క్లాస్ జరుగుతోంది. ప్రయోగాల మధ్యలో సైన్స్ టీచర్ బయటకు వెళ్లారు. ఆ సమయంలో క్లోరోక్విన్, లెమన్ సోడాలో విద్యార్థులు సోడియం కలపడంతో ఒక్కసారిగా విష వాయువులు విడుదలైనట్లు సమాచారం. దీంతో ల్యాబ్ లో ఉన్న విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు పరుగెత్తారు. మరికొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారిని సూర్యలంక సైనిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత ఉపాధ్యాయులు బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 6, 7 తరగతులకు చెందిన 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.