Achyutapuram : అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదం.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
Achyutapuram : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. ఎసెన్షియా కంపెనీలో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందగా, 18 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనకాపల్లిలోని పలు ఆస్పత్రులకు తరలించారు. మధాహ్నం లంచ్ టైంలో ప్రమాదం జరగడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.