Swarnalata Bhavishyavani : సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భాగంగా భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వడి బియ్యం, చీర సారెలతో భక్తులు అమ్మవారికి ముక్కులు సమర్పించుకున్నారు. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
‘‘నాకు సంతోషంగా ఉంది. నాకు కావలసిన పూజలన్నీ అందిస్తున్నారు. బాలికలు, యువతులు, మహిళలు ఇలా ఎవరు బోనం సమర్పించినా స్వీకరిస్తా. పంటలు బాగా పండుతాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కోరినన్ని వర్షాలు కురుస్తున్నాయి. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటున్నారు. ఆమాత్రం కష్టపడలేరా..? ఏమి తెచ్చినా ఆనందంగా తీసుకుంటా. ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతా. ప్రజలను చల్లగా కాపాడుకుంటా. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా. నా రూపాన్ని పెట్టండి. నా రూపాన్ని తప్పకుండా పెట్టించుకుంటా, నిలబెట్టుకుంటా. నా గ్రామ ప్రజలందరూ చల్లని సాగపడుతున్నారు’’ అంటూ స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, రంగం నేపథ్యంలో మహంకాళి అమ్మవారి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. అంతకుముందు అంబారీ ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం 7 గంటలకు ఫలహారం, బండ్ల ఊరేగింపుతో బోనాల జాతర ముగియనుంది.