Avinash Reddy : కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా నామినేషన్ దాఖలు చేశారు. కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
వివేకా హత్యకు సంబంధించి తన పేరు రెండు క్రిమినల్ కేసుల్లో ఉందని అవినాష్ తన అఫిడవిట్ లో బహిరంగంగా బయట పెట్టారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) హత్య, సాక్ష్యాల విధ్వంసం, కుట్రకు సంబంధించిన నేరాల కింద అభియోగాలు మోపిందని ఆయన పేర్కొన్నారు. తాను కూడా వారి విచారణకు సహకరిస్తున్నట్లు తెలిపారు.
నాంపల్లిలోని సీబీఐ కోర్టులో కేసు విచారణలో ఉందని అవినాష్ అఫిడవిట్ లో స్పష్టం చేశారు. హత్య కేసులో తాను ఏ8 అని తెలిపారు. అంతేకాకుండా తనపై మైదుకూరులో మరో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
ఇక ఆర్థిక ఆస్తుల విషయానికొస్తే అవినాష్ తన భార్య సమతతో కలిసి రూ.25.51 కోట్లు (రూ.25,51,19,305) విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. రూ.32.75 లక్షల విలువైన ఇన్నోవా కారు తన వద్ద ఉందన్నారు.
పులివెందుల మండలం వెలమవారిపల్లె, భాకరాపురం, అంకాలమ్మగూడూరు ప్రాంతాల్లో అవినాష్కు 27.40 ఎకరాల భూమి ఉంది. తన భార్యకు వైఎస్సార్ జిల్లా విశాఖపట్నం, వల్లూరు, ఊటుకూరు, పొనకమిట్టలో సుమారు 33.90 ఎకరాల భూములు ఉన్నాయని తెలిపారు.
గతంలో ఎంపీగా సునాయాసంగా గెలుపొందిన అవినాష్ రెడ్డి ఈ సారి కూడా ఈ ఎంపీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.