CM Jagan : రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేండ్లలో టీడీపీ సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెట్టించినా..ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ చేసిన పని ఒక్కటీ లేదని జనాలు విమర్శిస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఆయన ఏం చేశారు? ఏమీ చేయలేదు. కానీ ఏ చేశారని అందరూ అడుగుతున్నారని..ఇలా అడగడమే పద్మవ్యూహం అన్నట్లుగా తాను అభిమాన్యుడిని కాదు.. అర్జునుడినని..సినిమా డైలాగులు వల్లిస్తూ తెరపైకి వస్తున్నారు. జగన్ రెడ్డి అభిమాన్యుడా..అర్జునుడా ఎవరనేది తర్వాత.. ముందు ప్రజాస్వామ్య బద్ధంగా తన పాలనపై సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అది అధికారంలో ఉన్న నేత లక్షణం. అలా కాకుండా ప్రశ్నించడమే తప్పన్నట్లుగా ఏడ్చుకుంటూ ప్రజల వద్దకు వెళ్లడాన్ని ఏమనాలి?
కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెల్లి షర్మిల అన్నపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో ఆమెను, ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె భర్తను కించపరుస్తూ దాడి చేయిస్తున్నారు. కానీ షర్మిల అన్నపై వ్యక్తిగత విమర్శలు చేయడం లేదు. పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. తనను మోసం చేశారని మాత్రమే అంటున్నారు తప్పా..జగన్ పై, ఆయన భార్య భారతిపై వ్యక్తిగత దూషణలకు షర్మిల పోవడం లేదు. ప్రత్యేక హోదా నుంచి మద్యపాన నిషేధం వరకూ ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారని ప్రశ్నిస్తున్నారు.
విపక్షాలు జగన్ రెడ్డి చేతకాని తనాన్నే ప్రశ్నిస్తున్నాయి. ఐదేళ్లలో పది లక్షల కోట్ల అప్పులు చేసి.. తమరు చేసిన అభివృద్ధి ఏది అని అడుగుతున్నారు. పోలవరం ఎందుకు కట్టలేదు? మూడు రాజధానుల పేరటి ఐదేండ్లు ఎందుకు వృథా చేశారని విపక్ష నేతలు అడుగుతున్నారు. బటన్ నొక్కుడు పేరుతో బడుగుల్ని ఎందుకు మోసం చేశారని ప్రశ్నిస్తున్నారు. సెంట్ భూమి పేరుతో ఎందుకు పేదలను రోడ్డున పడవేశారని అడుగుతున్నారు.
చెల్లి, ప్రతిపక్ష నేతలే కాదు సామాన్య ప్రజలు కూడా ప్రశిస్తున్నారు. మద్యం దుకాణాల దగ్గర, రచ్చబండల దగ్గర ఒకసారి మీరైనా, మీ మనిషైనా మారువేషంలో నిలబడి గమనించండి. క్షేత్రస్థాయిలో ప్రజలు మిమ్మల్ని ఎంతగా తిట్టుకుంటున్నారో అర్థమవుతుంది. ఏపీ ప్రజలను అప్పుల కూపంలోకి నెట్టిన మీ పాలన నిర్వాకం ప్రతీ పేదవాడి ఇంటిలోనూ కనిపిస్తోంది. ఇలా చేస్తే ప్రశ్నించకుండా ఉంటారా? ప్రజలతో పాటు పార్టీల నేతలు కచ్చితంగా ప్రశ్నిస్తారు..అలా ప్రశ్నించడమే తప్పన్నట్టుగా చెప్పుకోవడం జగన్ రెడ్డి మానసిక డొల్లతనానికి సాక్షంగా కనిపిస్తోంది. ఈ స్థితి నుంచి జగన్ బయటపడడానికి ప్రజలు బటన్లు నొక్కడం ద్వారా ట్రీట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.