Momos : మోమోస్ తిని మహిళ మృతి.. మరో 50 మందికి అస్వస్థత

momos

momos

momos : మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్ లోని నందినగర్ లో చోటు చేసుకుంది.  అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్ విక్రయించారు. సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం(31)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వాటిని తిన్నారు. వీరందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో బంజారాహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మోమోస్ తిన్నవారిలో దాదాపు 10 మంది పిల్లలు ఉన్నారు. రేష్మ బేగం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమె దురదృష్టవశాత్తు మృతి చెందింది.

ఈ సంఘటనపై బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మోమోస్ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు. మోమోస్ తో పాటు ఇచ్చే మయోనైజ్, మిర్చి చట్నీ కలుషితమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

TAGS