Bridal party : పెళ్లి బృందం కోసం నిరీక్షించిన రైలు
bridal party : ఓ పెళ్లి బృందం కోసం రైలు కొన్ని నిమిషాలు నిరీక్షించింది. ఈ ఘటన హోవ్ డా రైల్వే స్టేషన్ లో జరిగింది. ముంబై నుంచి గీతాంజలి ఎక్స్ ప్రెస్ లో వస్తున్న పెళ్లి బృందం శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలకు హావ్ డా చేరుకోవాల్సి ఉంది. సాయంత్రం 5 గంటలకు బయల్దేరే హావ్ డా-గువాహటి సరాయ్ ఘాట్ ఎక్స్ ప్రెస్ లో వారు తదుపరి ప్రయాణం కొనసాగించాలి. కానీ గీతాంజలి ఎక్స్ ప్రెస్ ఆలస్యం కావడంతో తదుపరి రైలును అందుకోలేమని భావించిన బృందం ‘ఎక్స్’ ద్వారా రైల్వే వర్గాల సాయాన్ని కోరింది. వారి విషయం చూడవలసిందిగా ఉన్నతాధికారులు ఆదేశించడంతో డీఆర్ఎం స్పందించి రైలును కాసేపు నిలుపు చేయించారు. సాయంత్రం 4.08 గంటలకు గీతాంజలి ఎక్స్ ప్రెస్ రాగానే వారిని బ్యాటరీ వాహనాల్లో 24వ నంబరు ప్లాట్ ఫాం నుంచి 9వ నంబరు ప్లాట్ ఫాంకు అధికారులే తరలించి, ఆ తర్వాతే రైలును పంపారు. అలా రైలును ఆపకపోతే పెళ్లి కుమారుడు సహా బృందమంతా ఇబ్బందుల పాలయ్యేదంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవలందించడం తమ నైతిక బాధ్యత అని రైల్వే బదులిచ్చింది.