Bhatti Vikramarka : అత్యంత ఆధునాతన సాంకేతిక యుగంలో ఉన్న కూడా కొందరు మనుషుల్లో ఇంకా కుల,మత దురంహకారం పోవడం లేదు. సామాన్యుడి నుంచి పెద్ద పదవులు ఉన్నవారికి సైతం అవమానాలు తప్పడం లేదు. ప్రపంచంలోని ప్రతీ జీవి సమానమే. మనుషుల్లో తారతమ్యాలు ఉండకూడదు. కానీ ఇంకా ఈ మనుషుల్లో కుల, మత తారతమ్యాలు తగ్గడం లేదు. మన దేశంలోనైతే ఇది మరీ ఎక్కువ. దళిత బిడ్డలు రాష్ట్రపతి అయిన కూడా అగ్రవర్ణ పాలకులు ఇచ్చిన గౌరవం ఏపాటిదో మనం చూశాం..
దళితులు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా వారికి అవమానాలు తప్పడం లేదు. వందల ఏండ్లుగా అగ్రకులాలు, దోపిడీ కులాలు భూములను చెరబట్టి దళిత, బహుజనులను తమ దాసులుగా చేసుకుని పాలకులుగా చలామణి అవుతూ వచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ పౌరులు అందరూ సమానమే అని రాజ్యాంగం రచించుకున్న అది పత్రాల వరకే పరిమితం అయ్యింది. అగ్రకుల పాలకులు దళితులకు వ్యక్తిగతంగా ఇచ్చే ‘గౌరవ మర్యాదల’ను మనం చూస్తేనే ఉన్నాం.
ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్ట పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగింది. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో సీఎం సతీసమేతంగా పాల్గొన్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమయంలో సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సురేఖ పీటలపై ఆసీనులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టికి పీట లేకపోవడంతో కింద కూర్చున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకులు, దళిత, బహుజన సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
అయితే కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు బీఆర్ఎస్ విమర్శలను మీ పాలనలో ఇంతకంటే దారుణంగా చూశామని తోసిపుచ్చుతున్నారు. ప్రస్తుతం జరిగిన దాని గురించి మాట్లాడకుండా గతంలో జరిగిన విషయం ఇప్పుడు అవసరమా? గత పాలనలో అలా కూర్చుండబెట్టిన సందర్భాలు ఉన్నాయా? ప్రస్తుతం డిప్యూటీ సీఎంకే గౌరవం ఇవ్వకుంటే ఇంకా సామాన్య దళితుడి పరిస్థితి ఏంటి? అని జనాలు ప్రశ్నిస్తున్నారు. మొన్నటి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డే స్వయంగా రెడ్డిలే పాలకులు.. మిగతా వాళ్లంతా పాలితులు..అని తీవ్రంగా వ్యాఖ్యానించిన విషయం మనం చూసిందే. అప్పట్లో దాన్ని బయటకు రాకుండా చూశారు. బీఆర్ఎస్ పై కోపంతో జనాలంతా ఓ ప్రత్యామ్నాయంగా ఉండాలని మాత్రమే కాంగ్రెస్ కు ఓటేశారు. ముఖ్యంగా నిరుద్యోగుల వల్లే కాంగ్రెస్ గెలిచింది. అందులో రెడ్లు సీఎం అవుతారా? దళిత, బహుజనులు సీఎం అవుతారా? అని ఎవరూ ఆలోచించలేదు.
పాలకుల విషయంలో జనాలు పట్టించుకోకున్నా..పాలకులకు మాత్రం సరైన అవగాహనే ఉంది. సీఎం పదవిని అగ్రవర్ణాలకు తెచ్చుకోవడానికి వాళ్ల ప్రణాళిక వాళ్లకు ఉంది. అందుకే వారంతా ఒక్కటయ్యారు. తాజాగా భట్టిని అవమానించడంలో కూడా కుల దురంహకారం స్పష్టంగా కనపడుతోంది. ఆలయానికి మంత్రులు ఎవరెవరు వస్తున్నారనేది అక్కడి నిర్వాహకులకు తెలుసు. మరి అందరికీ పీటలు లెక్క ప్రకారం ఎందుకు వేయలేదు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన సీఎం పక్కనే ఉండాలి. మరి సీఎం పక్కన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ ఎలా కూర్చుంటారు. కూర్చుంటే భట్టినే కూర్చోవాలి. ఈ విషయం వారికి తెలియదనుకోవాలా?
ఇంత చిన్న విషయాన్ని పెద్దగా చేయడమెందుకని కొందరు అగ్రవర్ణాలు, కాంగ్రెస్ అభిమానులు అనుకోవచ్చు..కానీ మనిషికి ఇచ్చే గౌరవం ప్రోటోకాల్ లోనే కదా ఉండేది. ఒక దళిత ప్రజాప్రతినిధికి, అగ్రకుల ప్రజాప్రతినిధికి సమాజం ఎలా గౌరవాన్ని ఇస్తుందో తెలిసేది ఇలాంటి కార్యక్రమాల్లోనే కదా. దీన్ని వారు తేలిగ్గా తీసుకున్నా.. సమాజంలో ఇంకా కుల, మత తారతమ్యాలు ఉండడం మన దేశం చేసుకున్న దౌర్భాగ్యం. ప్రపంచమంతా కుల, మత రహితంగా ‘మనిషి’ ప్రధానం అని ముందుకెళ్తుంటే భారత్ లో మాత్రం కులమతాలను పట్టుకుని వేలాడడం మన పురోగతికి పెద్ద ప్రతిబంధకమే.