Telugu Man Died In Dubai : ఉన్న ఊరిలో బతకలేక.. సరైన కూలి, ఉపాధి లేక ఆర్జన కోసం విదేశాలకు వలస వెళ్లిన వారు అక్కడ మరణిస్తే ఇక్కడ వారి కుటుంబం బాధ వర్ణనాతీతమే.. తండ్రి వస్తాడని పిల్లలు, భర్త వస్తాడని భార్య, కొడుకు వస్తాడని తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఉన్న ఊరిలో ఉపాధి దొరకక, బతకడం భారమై విదేశాలకు వెళ్లి కూలీ, నాలీ చేస్తూ జీవించేందుకు ఎంతో మంది విదేశీ బాట పడుతున్నారు.
అక్కడ సరైన పని దొరకక, ఇబ్బందులు పడుతూ ఇక్కడి వారికి కష్టం చెప్పుకోలేక బాధపడుతున్నారు. అక్కడ సరైన పని లేక వెంట తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో మరింత ఆర్థిక సమస్యల్లో కుంగిపోతున్న మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలా మానసిక సమస్యలు శారీరక రుగ్మతలకు కూడా దారి తీస్తున్నాయి. దీంతో అక్కడే కన్ను మూస్తున్నారు.
ఇటీవల దుబాయ్ లో ప్రవాస భారతీయుడు గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాల్కొండ మండలంకు చెందిన తిప్పలబోయిన సాయిలు (42) దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ ఆయనకు గుండెపోటు రావడంతో రెండు రోజుల క్రితం మృతి చెందాడు. 20 ఏళ్లుగా సాయిలు బతుకు దెరువు కోసం దుబాయికి వెళ్తూ, వస్తూ ఉన్నాడు. ఏడాది క్రితం సెలవుపై వచ్చి వెళ్లాడు. ఆయన మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజా ప్రతినిధులు, అధికారులను కోరుతున్నారు. సాయిలుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు.