Tata Cancer Tablet : ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల కాలంలో క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారు. ఒకసారి క్యాన్సర్ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా కొంతకాలానికి మళ్లీ క్యాన్సర్ బారిన పడుతుంటారు. ఈ క్రమంలో.. ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా టాటా ఇన్‌స్టిట్యూట్ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో రెండోసారి క్యాన్సర్ బారిన పడకుండా ఔషధాన్ని కనిపెట్టింది. ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ టాటా ఇన్‌స్టిట్యూట్ ఈ మేరకు ప్రకటన చేసింది.
క్యాన్సర్ రెండోసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది. క్యాన్సర్‌ను అడ్డుకునేందుకు ఒక టాబ్లెట్‌ను అభివృద్ధి చేశామని పరిశోధనా బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. ఈ చికిత్స కోసం ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు, డాక్టర్లు దాదాపు 10 ఏండ్లు కృషి చేశారని వెల్లడించారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన టాబ్లెట్ రోగులలో రెండోసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు. రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50 శాతం మేర తగ్గించే సామర్థ్యం ఈ టాబ్లెట్‌కు ఉందని డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు. ఈ టాబ్లెట్ ధర కేవలం రూ.100 అని తెలిపారు. ఈ పరిశోధన కోసం పరిశోధకులు ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారు. దాంతో క్యాన్సర్ కణితి ఏర్పడింది. ఆ తర్వాత ఎలుకలకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స అందించారు.
క్యాన్సర్ కణాలు చనిపోయి ‘క్రోమాటిన్ కణాలు’ అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయాయని గుర్తించారు. ఈ చిన్న కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశిస్తే మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండో సారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిరోధించేందుకు డాక్టర్లు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ (R+Cu) కలిగిన ప్రో-ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు. కాపర్ ఆక్సిజన్ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తుంది అని రాజేంద్ర బద్వే వివరించారు. ఈ టాబ్లెట్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఇది జూన్-జులై నుంచి మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.