Mamunur Airport : తెలంగాణలో మరొక ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో కీలక ముందడుగు పడింది. ఎయిర్ పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు నిధులు విడుదల చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.
అంతేగాకుండా, ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్టు అథారిటీకి ఆర్ అండ్ బీ శాఖ లేఖ రాసింది. మామునూరు ఎయిర్ పోర్టు విస్తరణకు కావాల్సిన భూసేకరణ కోసం మంత్రుల బృందం అక్కడ పర్యటించింది. ఇప్పటికే ఎయిర్ పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా సేకరించే 253 ఎకరాల భూమిని రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇనుస్ట్రుమెంట్ ఇన్ స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనుంది. కాగా, రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారు.