Pothina Mahesh : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు కుదర్చుకున్న టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ ఫిరాయింపులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పటికే సీటు దక్కని పలువురు కీలక నేతలు పార్టీలకు గుడ్ బై చెప్పగా కొంత మంది పార్టీలో ఉంటూనే నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా చేశారు.
విశాఖ వెస్ట్ నుంచి టికెట్ ఆశించిన మహేశ్..ఆ సీటు దక్కకపోవడంతో గత కొంతకాలంగా బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈక్రమంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆదివారమే కార్యకర్తలతో సమావేశమై వారితో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు సీటు రాదని తేలిపోయిందని, ఇక ఎదురు చూసి లాభం లేదని డిసైడ్ అయ్యానన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. పార్టీ కోసం ఎంతో చేశానని, ప్రతీ రోజు తనకు పరీక్ష పెట్టారన్నారు. నా వల్ల కావడం లేదని, ఎమ్మెల్సీ ఇస్తానంటున్నారని, ఆ పదవి తనకు అవసరం లేదన్నారు. టికెట్ కోసం పెత్తందారులతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.
పోతిన మహేశ్ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పంపించారు. ఆ లేఖలో ఏముందంటే..‘‘ జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకు మరియు క్రియాశీలక సభ్యత్వమునకు రాజీనామా చేయుచున్నాను. ఇప్పటి వరకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు మరియు పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ అందులో పేర్కొన్నారు.
కాగా, కూటమిలో భాగంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం బీజేపీకి వెళ్లింది. అక్కడి నుంచి బీజేపీ తరుఫున సుజనా చౌదరీ పోటీ చేస్తున్నారు. దీంతో పోతిన మహేశ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా? లేక ఇతర పార్టీల్లో చేరుతారా? అన్నది తెలియాల్సి ఉంది.