Vegetables : కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు అందనంతగా ధరలు భారీగా పెరిగాయి. ఏ కూరగాయ ధర అడిగినా రూ.50కి పైగా రూ.100కి దగ్గరల్లో ఉన్నట్లు చెబుతున్నారు. కిలో టమాటా ధర మరోసారి రూ.100కి చేరడంతో వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. టమాటాతో పాటు.. అన్ని రకాల కూరగాయలు రూ.50కు మించి విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. టమాట ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రైతుబజార్లలో కిలో 48 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నంలోని 13 రైతు బజార్లలో కిలో 48 రూపాయలకు టమాటా విక్రయాలను మార్కెటింగ్ శాఖ చేపట్టింది. దీంతో సబ్సిడీ కౌంటర్ల వద్ద ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు.
తెలంగాణలోనూ కూరగాయల ధరలు.. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కూరగాయయినా కిలోకు రూ.100అంటూ వినియోగదారులకు వ్యాపారులు షాక్ ఇస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రవాణాకు ఆటంకం ఏర్పడడంతో కూరగాయల ధరలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. టమాటా కిలో 100, పచ్చిమిర్చి 100, చిక్కుడు 120, క్యారెట్ 100, కాకర 90, క్యాలీఫ్లవర్ 80 చొప్పున పలుకుతున్నాయి. ఆకు కూరల ధరలు కూడా మండిపోతున్నాయి. గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు వారానికి సరిపోయేవి. ఇప్పుడు కనీసం రెండు రోజులైనా సరిపోవడం లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.