Ganta Srinivasa Rao : ‘గంటా’కు షాక్.. ఇలా అయ్యిందేమిటీ?
Ganta Srinivasa Rao : టికెట్ల అసమ్మతి కూటమిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. టికెట్ దక్కని నేతల్లో ఆగ్రహా జ్వాలలు ఇంకా వ్యక్తం అవుతూనే ఉన్నాయి. టీడీపీ తుది జాబితాలో చోటు దక్కని నేతలు బహిరంగంగానే తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గంటా శ్రీనివాసరావు నాయకత్వాన్ని స్థానిక టీడీపీ, జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన భీమిలి టికెట్ దక్కించుకున్నారు. అయితే తొలుత గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు గంటాకు సూచించారు. చీపురుపల్లి వైసీపీకి కంచుకోట కావడంతో గంటా అక్కడి నుంచి పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో గంటా సీటును చంద్రబాబు పెండింగ్ లో ఉంచారు. ఒకనొక సమయంలో గంటాకు టీడీపీలో సీటు దక్కుతుందా లేదా అనుమానం కూడా వ్యక్తం అయింది.
చివరికి గంటా ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు ఆయనకు భీమిలి నియోజకవర్గం టికెట్ ను కేటాయించారు. అయితే గంటాకు భీమిలి టికెట్ ఇవ్వడంపై కూటమిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. భీమిలి సీటు గంటాకు కేటాయించడంతో కూటమిలో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. గంటాకు సీటు ఇవ్వడాన్ని టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భీమిలి నియోజకవర్గంలో చాలా మంది స్థానిక నేతలు ఉన్నప్పటికీ వారిని కాదని వలస నేత అయిన గంటాకు ఎలా టికెట్ కేటాయిస్తామరంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.
దీనిలో భాగంగానే భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కోరాడ రాజాబాబు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాలుగేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జనసేన నాయకులు కూడా గంటాకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. గంటాకు సహకరించేది లేదని.. అభ్యర్థిని మార్చాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. భీమిలి టికెట్ పై టీడీపీ, జనసేన నేతలు ఆశలు పెట్టుకోగా, ఆ స్థానాన్ని గంటా దక్కించుకోవడంతో స్థానిక నేతల్లో అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది.