Sri Lankan frog : ఈ భూమిపై ఎన్నో జీవరాశులు ఉన్నాయి. కాలానుగుణంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారిన జీవరాశులు మాత్రమే మనుగడ సాగిస్తాయి. కాలుష్యం కారణంగా ఉన్న ఒకట్రెండు జంతువులు కూడా చనిపోతున్నాయి. వాటిని గుర్తించి కాపాడేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. తాజాగా శేషాచలం అడవుల్లో అరుదైన శ్రీలంకలో మాత్రమే కనిపించే కప్పను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శ్రీలంకలో కనిపించే అరుదైన జాతికి చెందిన ‘శ్రీలంకన్ స్యూడో ఫిలేటస్ రిజియస్’గా పిలిచే గోధుమ రంగు చెవి పొద కప్పను శేషాచలం అడవుల్లో కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను శాస్త్రవేత్తలు, జీవవైవిధ్య మండలి పరిశోధకులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.
శ్రీలంక ద్వీపంలో నీటి ఆధారిత ప్రాంతాల్లో కనిపించే ఈ కప్ప శేషాచలం అడవుల్లోని తలకోన జలపాతం ప్రాంతంలో కనిపించిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ధ్రితి బెనర్జీ చెప్పారు. న్యూజిలాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ పత్రిక జూటాక్స్‌లో పరిశోధన వ్యాసం ప్రచురితమైందన్నారు. ఒకప్పుడు భారతదేశం, శ్రీలంక భూభాగాలు కలిసే ఉండేవన్న వాస్తవాలకు ఈ పరిశోధన బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. వేల సంవత్సరాల క్రితం శ్రీలంక, భారత భూభాగాలు కలిసి ఉండేవన్న థియరీకి ఈ కప్పే ఆధారమని తెలిపారు