Fish Rain : వర్షంతో పాటు చేపలు పడిన సంఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఇరాన్ లోని యసూజ్ లో ఈ తరహా కురిసిన వర్షం వీడియో వైరలవుతోంది. ఎప్పుడు వేడితో సతమతమయ్యే ఇరాన్ ప్రజలు వర్షాలతో తడిసి ముద్దవుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే యసుజ్ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు రోడ్డుపై చేపల వర్షం కురిసింది. కిలో నుంచి రెండు కిలోల బరువు ఉన్న చేపలు రోడ్డుపై పడడంతో వాహనదారులు, పాదాచారులు షాకయ్యారు. ఆ తర్వాత చేపలను ఏరుకునేందుకు పోటీపడ్డారు. ఈ ఘటనను వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరలవుతోంది.
అయితే, చేపల వర్షం కురవడం శాస్గ్రీయమే అంటున్నారు నిపుణులు. భారీ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదరుగాలులు వీస్తుంటాయి. ఆ సుడిగాలులు సముద్ర, నది, సరస్సులు, చెరువుల గుండా ప్రయాణించడంతో సుడిగాలిలో చేపలు, కప్పలు, ఇతర జలచర జీవులు గాల్లో ఎగిరి కింద పడిపోతుంటాయి. దీనినే చేపల వర్షం అంటారు.