Railway workerఇంజిన్, కోచ్ మధ్య నలిగి రైల్వే కార్మికుడి మృతి.. బీహార్ లో ఘటన
Railway worker Died : ఇంజిన్, కోచ్ మధ్య నలిగి ఓ రైల్వే కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. రైలు ఇంజిన్, బోగీల మధ్య కప్లింగ్ ను విడదీసే క్రమంలో వాటి మధ్య నలిగి రైల్వే పోర్టర్ మృతి చెందాడు. మృతుడిని అమర్ కుమార్ గా గుర్తించారు. ఘటనానంతరం ఆ ట్రైన్ లోకోపైలట్ అక్కడి నుంచి పరారయ్యాడు.
లఖ్ నవూ-బరౌనీ ఎక్స్ ప్రెస్ రైలు (15204) ఈ ఉదయం బరౌనీ స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నం.5కు చేరుకుంది. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న అమర్ కుమార్, ఇంజిన్, బోగీల మధ్య ఉండే కప్లింగ్ ను విడదీస్తుండగా, ఇంజిన్ రివర్స్ అయ్యింది. దీంతో వాటి మధ్య నలిగి ప్రాణాలు విడిచాడు. అప్పటికే ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు కేకలు వేయడంతో లోకోపైలట్ ఇంజిన్ ను ముందుకు నడిపే ప్రయత్నం కూడా చేయకుండా, వెంటనే ఇంజిన్ దిగి అక్కడి నుంచి జారుకున్నాడు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.