America : యూఎస్ లో భారతీయులకు, భారతీయ వ్యాపార వాణిజ్య సంస్థలకు రాను రాను రక్షణ లేకుండా పోతోంది. రోజు రోజుకు భారతీయుల మిస్సింగ్ లు, మర్డర్లు, రోడ్ యాక్సిడెంట్లు పెరగడంతో పాటు అవి చాలవన్నట్లు భారతీయులకు సంబంధించి షాపులు, దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో లూటీలు పెరుగుతున్నాయి. రెండు వారాల కింద ఒకటి జరిగితే మరోటి ఇటీవల జరిగింది.
రెండు వారాల్లో ఇది రెండో భారతీయ నగల దుకాణం దోపిడీ. రెండు వారాల క్రితం నెవార్క్ లోని భిండి జ్యువెల్లర్స్ కూడా ఇదే తరహాలో దోపిడీకి గురైంది. ఈ దోపిడీ ముఠాలు అమెరికాలోని భారతీయ నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ప్రధాన భారతీయ బ్రాండ్లు యూఎస్ఏలో శాఖలను తెరవాలని యోచిస్తున్నందున ఈ ధోరణి పెరుగుతుందని భారతీయ వాణిజ్య సంస్థలు భావిస్తున్నాయి.
బుధవారం (జూన్ 12) మధ్యాహ్నం 1.27 గంటలకు సన్నీవేల్ లోని పీఎన్‌జీ జ్యువెల్లర్స్ పై 20 మంది దుండగులు అనూహ్యంగా దాడి చేశారు. సుత్తెలతో డిస్ ప్లే కేస్ లను పగులగొట్టి నగలన్నింటినీ ఒక సంచిలో వేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న నిందితులు వాహనాల్లో పారిపోయారు. రెండు వాహనాలను గమనించిన పోలీసులు అందులో ఒకదాన్ని వెంబడించారు.
దీంతో నిందితులు కదులుతున్న వాహనం నుంచి దొంగిలించిన నగలను బయటకు విసిరేశారు. శాన్ కార్లోస్ లోని ఇండస్ట్రియల్ రోడ్, బ్రిటాన్ అవెన్యూ సమీపంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన నగల్లో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నప్పటికీ చోరీకి గురైన వస్తువుల మొత్తం విలువ ఇంకా తెలియరాలేదు.