Mythological Stories : ఇప్పుడు పురాణాలే కథా.. కథానికలు.. చరిత్ర.. సరికొత్తగా తెరపైకి
Mythological Stories : బాలీవుడ్ తో పాటు సౌత్ సినీ ఇండస్ర్టీలో యాక్షన్..రోమాంటిక్, కామెడీ, హర్రర్ సినిమాలు మాత్రమే ప్రస్తుతం తెరకెక్కుతున్నాయి. వీటినే కొంత అటు ఇటు మార్చి తిరిగి తెరపైకి తెస్తున్నారు. కానీ అంతకు మించిన సినిమాలు ఉన్నాయని నిరూపిస్తున్నారు దర్శకులు. ఒకప్పటి పౌరాణిక, జానపద చిత్రాలను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు టాలీవుడ్. విఠలాచార్య, బీఎన్ రెడ్డి మొదలుకొని ఎంతో మంది తెలుగుతెరపై పౌరాణికాలను తీర్చిదిద్దారు. తెలుగులో ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, కాంతారావు, కృష్ణ, కృష్ణంరాజు తర్వాత తరంలో బాలకృష్ణ పౌరాణిక, జానపద చిత్రాలతో అలరించారు. తమకు సాటిలేదని నిరూపించారు. అసలు గ్రాఫిక్స్ అంటే తెలియని రోజుల్లో మాయాబజార్ లో చేసిన అద్భుతాలు అంతా ఇంతా కాదు. ఇంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటికీ ఆ సినిమా గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది.
ఇక టాలీవుడ్ లోనూ మళ్లీ ఆ తరహ సినిమాలకు బీజం వేశాడు రాజమౌళి. బాహుబలితో కొత్త దారి వేశాడు. సైన్స్, ఫిక్షన్ మేళవింపులతో సిల్వర్ స్ర్కీన్ సరికొత్త చిత్రాలు వస్తున్నాయి. ఇటీవల వచ్చిన హను-మాన్, ప్రస్తుతం ట్రెండ్ క్రియేట్ చేస్తున్న కల్కి. ఎన్నో పురాణాలు, ఇతిహాసాలను చరిత్రలో దాచుకున్న భారతీయ సంస్కృతీ నుంచి ఒక్కో యోధుడి కథలు ఈ తరం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
అలాగే భారీ బడ్జెట్ తో నిర్మించిన కల్కి 2898 AD మూవీతో మన పురాణ గాథల వీరుడి చరిత్ర తెరకెక్కింది. మహాభారతంలో ముఖ్యమైన కురుక్షేత్ర యుద్ధం నేటి రంగుల ప్రపంచానికి ఒక బ్రహ్మస్ర్తంగా మారింది. అర్జునుడి గాండీవం మొదలుకొని కర్ణుడి వీరత్వం దాకా, కృష్ణుడి చాణుక్యం నుండి భీష్ముడి పరాక్రమం వరకు ఎన్నో ఇతిహాసాలు వెండి తెర మీద మళ్లీ ఆవిష్కృతమవుతున్నాయి.
మహాభారతంలోని కొన్ని ఘట్టాలను నేపథ్యంగా తీసుకొని తెరకెక్కిన కల్కి మూవీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నది. కలెక్షన్ల పరంగా అన్ని రికార్డులను తిరగరాస్తున్నది. వెయ్యి కోట్లు కొల్లగొట్టే దిశగా పయనిస్తున్నది.