Restaurant : రెస్టారెంట్ భోజనంలో తనకు పచ్చడి వడ్డించలేదని ఓ వ్యక్తి కోర్టుకెక్కగా రెండేళ్లు తర్వాత తీర్పు వెలువడింది. అన్నంలో పచ్చడి వడ్డించకపోవడం సేవల్లో లోపమేనని భావించిన న్యాయమూర్తి సదరు రెస్టారెంట్ కు ఏకంగా రూ.35,025 జరిమానా విధించారు. ఈ మొత్తం డబ్బు నెలన్నర లోగా చెల్లించాలని, విస్మరిస్తే నెలకు 9 శాతం వడ్డీతో సహా పెనాల్టీ మొత్తం చెల్లించాలని కోర్టు సదరు రెస్టారెంట్‌ను ఆదేశించింది.
తమిళనాడులోని విల్లుపురం బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పాలమురుగన్ అనే రెస్టారెంట్ మేనేజర్ భోజనం పార్శిల్‌లో 11 ఐటెమ్స్ ఇస్తామని బోర్డు పెట్టాడు. 2022లో వలుతారెడ్డి ప్రాంతానికి చెందిన ఆరోగ్యసామి అనే వ్యక్తి సదరు రెస్టారెంట్‌లో 25 మందికి భోజనం పార్శిళ్లను తీసుకునేందుకు వెళ్లాడు. అక్కడి భోజనం ధరపై ఆరా తీయగా.. అన్నం, సాంబారు, కరివేపాకు, రసం, మజ్జిగ, దంపులు, ఊరగాయ పచ్చడి, అరటి ఆకులు, పచ్చిమిర్చి కలిపి మొత్తం 11 రకాల ఐటెమ్స్ ఇస్తామని, భోజనం ఖరీదు రూ.80 అని రెస్టారెంట్ యాజమాని వివరించాడు. దీంతో సదరు వ్యక్తి రెస్టారెంట్ నుంచి భోజనం పార్శిళ్లను తీసుకెళ్లాడు.
భోజనం చేస్తుండగా అతడికి పార్శిల్‌లో పచ్చడి కనిపించలేదు. 11 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పిన పార్శిల్ లో పచ్చళ్లు లేకపోవడంతో ఆరోగ్యస్వామి సంబంధిత హోటల్ యాజమానిని ప్రశ్నించాడు. హోటల్ యాజమాని అతడికి సమాధానం చెప్పకపోగా.. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో ఆరోగ్యస్వామి.. వినియోగదారుల ఫోరంలో కేసు ఫైల్ చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు భోజనంలో పచ్చడి లేకపోవడంతో పిటిషనర్ మానసిక క్షోభ కు గురయ్యాడని పేర్కొంటూ సదరు రెస్టారెంట్‌కు జరిమానాగా రూ.35వేలు, పచ్చడికి గాను రూ. 25 చెల్లించాలని యాజమన్యాన్ని ఆదేశించింది.