earthquake : ఇటీవల తెలంగాణలో భూకంపం సంభవించబోతోందనే ఊహాగానాలు ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో భూమి లోపల కదలికలు కనిపిస్తున్నాయని “ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్” అనే సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలు హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ప్రభావం చూపొచ్చని వారు పేర్కొన్నారు.అయితే, ఈ సంస్థ నివేదికను ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వ విభాగాలు గానీ, ప్రముఖ శాస్త్రవేత్తలు గానీ ధృవీకరించలేదు. కేంద్ర వాతావరణ శాఖ చెబుతోన్నది ఏమిటంటే – భూకంపాలను ఖచ్చితంగా ముందుగా ఊహించడం శాస్త్రానికి ఇంకా సాధ్యం కాలేదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భూకంప ప్రమాద పరంగా పెద్దగా హై రిస్క్ జోన్ కాదు. గతంలో వచ్చిన కొన్ని స్వల్ప ప్రకంపనలతో తప్ప పెద్ద నష్టం జరిగిన చరిత్ర లేదు. అయినా, అప్రమత్తత అవసరం. భూమి ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి, నిర్ధారణ లేని సమాచారంపై భయపడకుండా, ప్రాథమిక భద్రతా చర్యలు పాటించడం వల్లే మనం రక్షితంగా ఉండగలమని అధికారులు సూచిస్తున్నారు.