Tomato Price : కిలో టమాట రూ.200, చికెన్ ఏకంగా రూ.700..హడలెత్తిస్తున్న ధరలు
Tomato Price : పాకిస్థాన్‌లో కొనసాగుతున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. బక్రీద్ కు ఒకరోజు ముందు టమాట ధర కిలో రూ.200లకు పైగా పెరిగిందని పాక్ మీడియా పేర్కొంది. ప్రభుత్వం టమాట ధర కిలో రూ.100గా నిర్ణయించింది. వారం తిరిగే సరికి ధర రూ.200కు చేరుకుంది. లాహోర్‌లోని పండ్లు, కూరగాయల విక్రేతలు ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెషావర్ డిప్యూటీ కమిషనర్ సెక్షన్ 144 విధించింది. జిల్లా నుంచి టమాటల రవాణాను నిషేధించారు.
ప్రభుత్వం ధరల నియంత్రణకు ప్రయత్నిస్తున్నప్పటికీ మార్కెట్ ధరలపై నియంత్రణ ఉండడం లేదు. అధికారిక ధరలతో పోలిస్తే పచ్చిమిర్చి, నిమ్మకాయల ధరలు రెట్టింపు అయ్యాయి. అల్లం, వెల్లుల్లికి దుకాణదారులు 40-50శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. కిలో కోడి మాంసం ధరలో రూ.56 పెరుగుదల కనిపించింది. దీని అధికారిక ధరలు కిలో రూ.494 అయితే మార్కెట్‌లో కిలో రూ.520-700 వరకు విక్రయిస్తున్నారు. ఎ-గ్రేడ్ ఆలుగడ్డ కిలో రూ.75-80గా నిర్ణయించగా, కిలో రూ.130-140 వరకు విక్రయిస్తున్నారు. ఉల్లిపై ప్రభుత్వ ధరల్లో తగ్గుదల కనిపించింది, ఎ-గ్రేడ్ ఉల్లి ధర కిలో రూ. 100-105గా నిర్ణయించారు. మార్కెట్లలో కిలో రూ.150కి విక్రయిస్తున్నారు.
ప్రతి సంవత్సరం రంజాన్, బక్రీద్ సమయంలో ద్రవ్యోల్బణంతో ప్రజలు నష్టపోతున్నారని ఓ నివేదిక చూపిస్తుంది. అయితే వారు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపున్నా అధికారులు దానిని పట్టించుకోవడం లేదు. స్థానిక రిటైల్ మార్కెట్‌లో టమోటా ధర రెండింతలు పెరిగింది. బక్రీద్ సమయంలో టమోటాలు, ఉల్లిపాయలు రెండూ బ్లాక్ మార్కెట్లో అమ్ముడవుతాయని భయపడ్డారు. ఒక్కరోజులోనే టమాటా ధరలు కిలోకు రూ.100 పెరిగాయని, ఇప్పుడు జిల్లా యంత్రాంగం చేసే ప్రయత్నాలు మళ్లీ మౌఖిక సూచనలకే పరిమితమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.