Gold : కిలో బంగారం రూ.10 లక్షలు.. మహిళలకు టోకరా

Gold

Gold

Gold Scam : బ్యాంకులో వేలం పాటలో కొన్న బంగారు బిస్కెట్లను విక్రయిస్తున్నానని ఓ మాయలేడి పలువురు మహిళల నుంచి పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టింది. ఆమెకు వైఎస్సార్సీపీ నేతలు పలువురు సహకరించినట్లు తెలుస్తోంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త బ్యాంకులో పనిచేస్తున్నాడని, బ్యాంకు వేలంపాటలో బంగారు బిస్కెట్లను గతంలో కొనుగోలు చేశామని, డబ్బులు అవసరం కావడంతో ఇప్పుడు వాటిని విక్రయిస్తున్నట్లు పలువురిని నమ్మించింది.

కిలో బంగారు బిసస్కెట్లను రూ.10 లక్షలకే ఇస్తానని ఆశ చూపింది. ఇది నమ్మిన టెక్కలి, విశాఖపట్నం, నౌపడ తదితర ప్రాంతాలకు చెందిన మహిళల నుంచి రూ.కోటికి పైగా కాజేసింది. ఈ క్రమంలో బంగారు బిస్కెట్లు ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితులు రెండు నెలల కిందట మాయలేడిని నిలదీశారు. తులం బంగారానికి 2 తులల బంగారం అందజేస్తానని, లేదంటే డబ్బు ఇస్తానని మరోసారి ఆశ చూపింది. మళ్లీ ఇటీవల బాధితులు ఒత్తిడి చేయడంతో పలాస, టెక్కలి, నరసన్నపేట, విశాఖపట్నంలోని బంగారం దుకాణాల్లో బిస్కెట్లు తయారవుతున్నాయని నమ్మించింది. ఈ విషయమై కొందరు నేతల వద్ద పంచాయితీ జరిగింది. ఈ మోసం బయటపడకుండా గతంలో ఓ కళాశాల ఛైర్మన్ గా పనిచేసిన వ్యక్తితో పాటు మరికొందరు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు వారు రూ.లక్షల్లో వసూలు చేశారు. దస్తావేజులు, ఈ-స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించడంలో వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరించారు.

పది రోజుల క్రితం టెక్కలి, నౌపడ మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మాయలేడిని పిలిపించగా, బాధితులతో రాజీకి వచ్చి కొన్ని రోజుల గడువు అడిగింది. ఇటీవల ఆ గడువు ముగియడంతో మళ్లీ మహిళలు ఆమెను నిలదీస్తే దుర్భాషలాడుతూ ఎదురుదాడికి దిగింది. దీనిపై నౌపడ ఎస్సై నారాయణస్వామిని సంప్రదించగా, బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు.

TAGS