CM Revanth : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి సీఎం అయినా.. తనకు రాజకీయ హోదాను ఇచ్చిన టీడీపీ అంటే ఎంతో ప్రేమ. అది పలుసార్లు ఆయన మాటల్లోనే రుజువైంది కూడా. సందర్భం వచ్చినప్పుడల్లా టీడీపీపై మమకారం కురిపిస్తుంటారు. ఆయన తెలంగాణ సీఎం అయిన తర్వాత కూడా అలాంటి ప్రేమనే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలోని కీలక పదవులను భర్తీ చేసే పనిలో పడ్డారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీ పదవులు కేటాయించారు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు పదవితో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవులు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
టీడీపీలో గతంలో పనిచేసి రేవంత్ రెడ్డితో సహ కాంగ్రెస్ లో చేరిన వేం నరేందర్ రెడ్డి, మరో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావుకు ఈ కీలక పదవులు ఖరారైనట్లు సమాచారం. వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ తో నరేందర్ కు దాదాపు 16 ఏండ్ల స్నేహం ఉంది. టీడీపీలో ఇద్దరూ కలిసే పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్ ఎన్నికయ్యారు. ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలిద్దరి మధ్య స్నేహబంధం బలపడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ నియోజకవర్గం ఎస్టీ కోటాలోకి వెళ్లిపోయింది.
2015లో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో నామినేట్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్ సన్ వద్దకు రేవంత్ వెళ్లారు. అప్పుడు జరిగిన విషయాలన్నీ మనకు తెలిసిందే. కష్టకాలంలో రేవంత్ వెంట నరేందర్ ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో నరేందర్ రెడ్డి కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఎన్నికల టైంలో కూడా రేవంత్ కు చేదోడు వాదోడుగా నరేందర్ నిలిచారు. దీంతో మిత్రధర్మం పాటించేందుకు రేవంత్ ..ఆయనకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వనున్నారని సమాచారం. దీనికి కేబినేట్ హోదా ఉంటుంది.
ఇక టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు కూడా కీలక పదవిని ఇవ్వాలని రేవంత్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీనికి కూడా కేబినేట్ హోదా ఉంటుంది. ఈ హోదాతో ఆయన్ను మంత్రివర్గ సమావేశాలకు ఆహ్వానించే అవకాశం కూడా ఉంటుంది. కాగా, వీరి పదవులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. రేవంత్ విదేశీ పర్యటన నుంచి రాగానే ఆ పని చేస్తారని సమాచారం.