Hyderabadi Died in USA : ఇటీవలి కాలంలో అమెరికాలో తెలుగు వారు ప్రమాదాలకు గురవుతూ మరణించడం, లేదంటే అదృశ్యమైన కేసులు ఎక్కువగా చూస్తున్నాం. గత నెలలో ఇద్దరు యువకులు కారు ప్రమాదంలో మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పడు అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హైదరాబాదీ దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని అలకాపురికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. పృథ్వీ తన భార్య శ్రీప్రియతో కలిసి ఎనిమిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటన జరిగిన తర్వాత పృథ్వీ పోలీసులకు డయల్ చేసేందుకు కారు నుంచి దిగగా మరో కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందగా, అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. కొన్నేళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన పృథ్వీ డిప్రెషన్ తో పోరాడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. పృథ్వీరాజ్ కు ఏడాది క్రితం శ్రీప్రియతో వివాహం జరిగింది. తన తల్లి బాధ్యత, సోదరి వివాహం తనపై పడింది. పృథ్వీ రాజ్ తో పాటు అతని భార్య కూడా అమెరికాలోనే ఉంది.
అతని మృతదేహాన్ని హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లోని ఇంటికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకు అమెరికాలోని ఎంబసీని కూడా సంప్రదిస్తున్నట్లు తెలిపారు.