Hyderabad Realtor : హైదరాబాద్ లోని జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ఓ రియల్టర్ కర్ణాటకలోని బీదర్ వద్ద దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన కుప్పం మధు ఈనెల 24న చింతల్ లో అదృశ్యమయ్యాడు. మధు గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మధు మే 24న మధ్యాహ్నం చింతల్ ప్రాంతంలో కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మ మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.
ఈరోజు కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో మధు మృతదేహం లభ్యమైంది. ఆయనను బండరాయితో మోది అత్యంత దారుణంగా హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
మధును కిడ్నాప్ చేసినవారే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మధు అదృశ్యమైన రోజు ఆయన వెంట ఉన్న రూ.5 లక్షల నగదు, ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు కూడా మాయమయ్యాయి. మధు హత్యకు ఆర్థిక లావాదేవీలో కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.