Pithapuram : ఏపీని డెవలప్ చేయడమే ముఖ్య లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కంకణా బద్ధులై పని చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి నెలలోనే ఎన్నో ప్రాజెక్టులను తేవడంలో సఫలీకృతమయ్యారు. ఇక మధ్య ప్రదేశ్ కు వెళ్లనున్న భారీ ప్రాజెక్ట్ ఏపీకి తరలించడంలో సఫలీకృతులయ్యారు. ఈ ప్రాజెక్ట్ ను డిప్యూటీ సీఎం నియోజకవర్గం పిఠాపురంలో నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) రిఫైనరీ ప్రాజెక్ట్ ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు సాగుతోంది. నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి. పవన్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తే పిఠాపురంకు భారీ ప్రాజెక్టు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో కొత్త సంస్థ
పెట్రోలియం సంస్థ బీపీసీఎల్ 50 వేల కోట్లతో ప్రతిపాదించిన రిఫైనరీ ఏపీకి దక్కడం ఖాయమైంది. ఈ రిఫైనరీ కోసం గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్, మధ్య ప్రదేశ్ పోటీపడ్డాయి. కానీ ఏపీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రిఫైనరీ ద్వారా చిన్న తరహా పరిశ్రమలు కూడా ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలుత మచిలీపట్నం పరిధిలో ఏర్పాటు చేయాలని చర్చలు జరిగాయి. అయితే పిఠాపురానికి కేటాయించాలననే ప్రతిపాదనలు వస్తున్నాయి.
పిఠాపురంపై ఢిల్లీ స్థాయిలో చర్చ..
దీనిపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కాకినాడ పరిసరాలు పిఠాపురం నియోజకవర్గంలో 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ ఆర్థిక మండలి ఏర్పాటు చేశారు దాదాపు 12,500 ఎకరాల్లో దీన్ని కేటాయించారు. 20 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. మధ్యలో ఒకటి, రెండు చిన్న చిన్న పరిశ్రమలు వచ్చినా తక్కువ కాలంలోనే మూసేశారు. పరిశ్రమల కోసం రైతుల నుంచి సేకరించిన 12,500 ఎకరాల భూమి నిరుపయోగంగా మిగిలింది. ఈ ప్రాంతాన్ని పెట్రోలియం ఆధారిత పెట్రోల్ ఉత్పత్తుల ఆర్థిక మండలిగా ప్రకటించారు. కానీ ఒక్క పెట్టుబడి కూడా ఇప్పటికీ రాలేదు.
పవన్ ప్రయత్నిస్తే
ప్రచారం సమయంలో పవన్ తాను గెలిచిన తర్వాత భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే కేంద్రంలో తను పరపతిని ఉపయోగించి పరిశ్రమలను రప్పిస్తే స్థానికంగా వేలాది మందికి ఉపాధి కలిగించిన వారం అవుతామని డిప్యూటీ సీఎంగా పర్యటించిన సమయంలోను ప్రస్తావించారు.